Have a nice day!

సైరా నరసింహారెడ్డి సినిమా రివ్యూ

తెల్లదొరలకు ఎదురుతిరిగిన తెలుగోడు: సైరా రివ్యూ

0 6

సినిమా: సైరా నరసింహారెడ్డి
బ్యానర్‌: కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ
నటీనటులు: చిరంజీవి, నయనతార, తమన్నా, అమితాబ్‌బచ్చన్‌, జగపతిబాబు, సుదీప్‌, విజయ్‌ సేతుపతి, రవికిషన్‌, నిహారిక, బ్రహ్మాజీ, రఘుబాబు, మాథ్యూ స్టిర్లింగ్‌ తదితరులు
కథ: పరుచూరి బ్రదర్స్‌
సంగీతం: అమిత్‌ త్రివేది
నేపథ్య సంగీతం: జూలియస్‌ ప్యాకియం
ఎడిటింగ్: శ్రీకర్‌ ప్రసాద్‌
సినిమాటోగ్రఫీ: ఆర్‌. రత్నవేలు
నిర్మాత: రామ్‌ చరణ్‌
కథనం, దర్శకత్వం: సురేందర్‌ రెడ్డి
విడుదల తేదీ: 2 అక్టోబర్‌ 2019

దశాబ్ధాలుగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవికి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. చిరంజీవి వేయని పాత్రలు లేవు. అటువంటి చిరంజీవికి కూడా ఒక కలగా మిగిలిన పాత్ర ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి. 20ఏళ్లుగా ఆ పాత్రను ఎలాగైనా చేయాలని గట్టిగా నిర్ణయించుకుని చివరకు ఆ కలను సాకారం చేసుకున్నారు. తన కొడుకు రామ్ చరణ్ నిర్మాతగా మారగా.. తెలుగు స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి జీవిత చరిత్రను కథాంశంగా తీసుకుని రూ.250కోట్లకు పైగా బడ్జెట్ తో తెరకెక్కించిన సినిమా ‘సైరా నరసింహారెడ్డి’. భారీ అంచనాల మధ్య అట్టహాసంగా థియేటర్లలోకి వచ్చింది. ప్యాన్ ఇండియా మూవీగా రిలీజైన ఈ సినిమా అంచనాలకు తగ్గట్టు ఆకట్టుకుందా? లేదా? అనే తెలుసుకోవాలంటే రివ్యూలోకి వెళ్లాల్సిందే.

కథ:
కులానికి లొంగ‌నివాడు.. మ‌తానికి మారనివాడు.. ప్రాంతానికి పడనివాడైనా.. దేశభక్తి అనగానే ఎటువంటి వ్యక్తికైనా కూడా రోమాలు నిక్కబొడుచుకుంటాయి. అటువంటి సమరయోధుని కథే సైరా నరసింహారెడ్డి కథ. దేశ భక్తి ఎమోషన్ ను గుర్తు చేసే కథాంశమే ఇది. అందులోనూ ఇది మ‌న‌ తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ఓ వీరుడి క‌థ‌, ఎవ్వ‌రూ చెప్ప‌ని ఓ అచ్చ‌మైన తెలుగువాడి క‌థ‌. స్వాతంత్ర పోరాటం అని అనుకోగానే అందరికి మొదటగా గుర్తొచ్చేది 1857 నాటి సిపాయిల తిరుగుబాటు.. అయితే అంతకు పదేళ్ల ముందే తెలుగునాట ఓ రేనాటి సుర్యుడు తిరుగుబాటు చేశాడనే విషయం చాలామందికి తెలియదు. అటువంటి తెలియని కథను భారతదేశంలో బ్రిటిషు ఈస్ట్ ఇండియా కంపెనీకి వ్యతిరేకంగా జరిగిన తిరుగుబాటును చూపించడమే సినిమా కథ.

అది రాణి రుద్రమ దేవి నాటి కాలం భారత సంపద దోచుకుంటున్న బ్రిటీషోళ్లతో బికర యుద్ధం చేస్తున్న రుద్రమదేవికి అనుకోని అవాంతరం ఏర్పడుతుంది. భయంతో మధ్యలోనే యుద్ధం ఆపేద్దామని సైనికులు అనుకునే సమయంలో వారిలో దైర్యాన్ని నింపడానికి ఉయ్యాల వాడ నరసింహ రెడ్డి వీర చరిత్రన సైనికులకు చెబుతుంది రుద్రమదేవి. మద్రాస్ క్యాపిటల్ గా అప్పుడప్పుడే భారతదేశంలో తమ వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరింప చేసుకుంటూ ఉంటుంది బ్రిటిషు ఈస్ట్ ఇండియా కంపెనీ. ప్రజల నుంచి బలవంతంగా పన్నులు వసూలు చేస్తున్న వీరికి నరసింహ రెడ్డి రూపంలో తిరుగుబాటు ఎదురవుతుంది. నరసింహ రెడ్డి ఒక సామ్రాజ్యనికి పాలే గాడు కాగా అతని సామ్రాజ్యం చుట్టుపక్కల మరో అరవై సంస్థానాలు ఉంటాయి. ఐకమత్యం లేని ఆ సామ్రజ్యాలకు చెందిన రాజులను ఏకం చేసి ఆంగ్లేయులను దేశం నుండి తరిమేయలనేది నరసింహ రెడ్డి ఆలోచన.

బ్రిటీషు దొర‌ల‌ పెత్తనంలో పంట పండ‌క‌పోయినా.. ప్ర‌భుత్వానికి శిస్తు క‌ట్టాలి. అల‌సిపోయిన ప్ర‌జ‌ల‌కు.. వాళ్ల క‌ష్టాల‌కూ, క‌న్నీళ్ల‌కూ బాస‌ట‌గా నిలుస్తాడు ఉయ్యాల‌వాడ న‌ర‌సింహారెడ్డి. ఈ భూమి మాది, పంట మాది, క‌ష్టం మాది.. నీకెందుకు శిస్తు క‌ట్టాలి? అంటూ తొలిసారి బ్రిటీషు దొర‌ల‌పై యుద్ధం ప్ర‌క‌టిస్తాడు. కానీ.. త‌న‌కంటూ ఓ సైన్యం లేదు. మిగిలిన పాలేగాళ్ల‌ను క‌లుపుకోవాలంటే.. వాళ్ల‌లో ఐక‌మ‌త్యం ఉండ‌దు. ఈ సమయంలోనే నరసింహారెడ్డికి సొంత మనుషులే వెన్నుపోటు పొడుస్తారు. ఈ ద‌శ‌లో రేనాటి సూరీడు ఉయ్యాలవాడ ఎలా ఉద్య‌మించాడు? ఆ సంగ్రామంలో త‌న‌కు బాస‌ట‌గా నిలిచిన‌వాళ్లెవ‌రు? వెన్నుపోటు పొడిచిన వాళ్లెవ‌రు? దేశం కోసం తానేం చేశాడు? అనే విషయం తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ:
చరిత్రను చరిత్రగా చెప్పాలంటే డాక్యుమెంటరీలా అవుతుంది. అందుకే కథకు కాస్త సినిమాకు కాస్త డ్రామా యాడ్ చేసింది చిత్ర యూనిట్. చ‌రిత్ర‌లో ఉన్న విష‌యాల‌కు క‌ల్ప‌న జోడించి తీసిన సినిమా ఇద‌ని, సినిమాటిక్ లిబ‌ర్టీ తీసుకున్నామ‌ని టైటిల్ కార్డుకు ముందు ద‌ర్శ‌కుడు చెప్పినా కూడా క‌ల్ప‌న‌ల మిశ్ర‌మం కాస్త ఎక్కువైనట్లుగా అనిపిస్తుంది. సినిమా మొదలుపెట్టిన నాటి నుంచి ఎమోషనల్ గా నరసింహారెడ్డికి కనెక్ట్ అయినవారికి ఇది ఒక కల్పన అనగానే కాస్త ఇబ్బందిగా అనిపిస్తుంది. అయితే ఓ క‌థ‌ని తెలుగు సినిమా ప‌డిక‌ట్టు సూత్రాల‌కు, క‌మ‌ర్షియ‌ల్ విలువ‌ల‌కు అనుగుణంగా మ‌ల‌చాలంటే, ఆ మాత్రం కల్పితం యాడ్ చేయక తప్పదు.

చిన్నతనం నుంచే ఆంగ్లేయులపై పగతో రగిలిపోతూ ఉండే నరసింహారెడ్డి, పెద్దయ్యాక బ్రిటిషోళ్లతో పోరాడే సన్నివేశాలు డ్రామా కోసం పెట్టినట్లుగా అనిపిస్తుంటాయి. ఎద్దుల పోటి బ్యాక్ డ్రాప్ లో చిరంజీవి ఇంట్రడక్షన్ యాక్షన్ సీన్ బాగుంటుంది. బ్రిటీషువారి దౌర్జ‌న్యాలు పెరిగిపోవడం, వాళ్ల‌పై ఉయ్యాల‌వాడ న‌ర‌సింహారెడ్డి తిరుగుబాటు జెండా ద‌గ్గ‌ర నుంచి క‌థ ఊపు అందుకుంటుంది. ఇంటర్వెల్‌‌కు‌ ముందు బ్రిటీష్ లీడర్‌ను చంపి లండన్‌కు మెసేజ్ పంపే సీన్ రోమాంఛితంగా సాగుతుంది. చిరంజీవి నుంచి అభిమానులు ఆశించే హీరోయిజం ఆ స‌న్నివేశాల్లో క‌నిపిస్తుంది. మ‌ధ్య‌లో త‌మ‌న్నా, న‌య‌న‌తార‌ల పాత్ర‌ల‌కు న్యాయం చేయాల‌నే ఉద్దేశంతో కాస్త సన్నివేశాలను ఇరికించినట్లుగా కనిపిస్తుంది.

ప్ర‌తీ స‌న్నివేశాన్ని రిచ్‌గా తీశారు. విజువ‌ల్ గ్రాండియ‌ర్ కారణంగా.. స్టార్ కాస్టింగ్ వ‌ల్ల‌ సన్నివేశాలు బోర్ అయితే కొట్టవు. ద్వితీయార్థం కూడా హై ఎమోష‌న్‌తో మొదలవుతుంది. యుద్ధ స‌న్నివేశాలు, పోరాటాలు ఎక్కువగా చూపించేశారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. అవ‌న్నీ `సైరా`కి విజువ‌ల్‌గా బాగా పనికొచ్చాయి. కానీ యాక్ష‌న్ మరీ ఎక్కువగా అనిపించింది. బాహుబలి వంటి సినిమా వచ్చిన తర్వాత ఈ సినిమా అదే తరహాలో రావడంతో సినిమాపై అంచనాలు కూడా భారీగానే ఉంటాయి. అయితే ఆఖర్లో మాత్రం 80 కోట్లు పెట్టి తీసిన యుద్ధ ఘట్టాలు ఇవేనా అనిపిస్తుంది. క్లైమాక్స్ మాత్రం కల్పితం అయినా రోమాలు నిక్కబొడుకునేలా తీశారు. క్లైమాక్స్ లో లాజిక్ కంటే ఎమోషన్ డామినేట్ చేస్తుంది. కచ్ఛితంగా గొప్ప క్లైమాక్స్ సన్నివేశాల్లో ఇది ఒకటి. కానీ కేవలం క్లైమాక్స్ వల్ల ఒక సినిమా ఎప్పటికీ గొప్పది అవ్వదు. క్లైమాక్స్ వరకూ విసిగించకుండా కూర్చోబెట్టినా బొమ్మ హిట్టు అవుతుంది.

నటీనటులు:
నటనపరంగా ఈ సినిమాలో నటించినవాళ్ల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించవలసిన అవసరం లేదు. ప్రతీ ఒక్కరు ఇండియాలో ఇప్పటివరకు తమ సత్తా ఏంటో నిరూపించుకున్న నటులే కావడంతో సినిమాకు భారీ హైప్ వచ్చింది. అమితాబ్ బచ్చన్, కిచ్చ సుదీప్, విజయ్ సేతుపతి, నయనతార, తమన్నా, అనుష్క వంటి పెద్ద పెద్ద నటులు నటించగా.. ఎక్కడా వంకలు పెట్టాల్సిన అవసరం లేదు. అయితే చిరంజీవి వయసే సైరా పాత్రకి కొంచం మైనస్ అయింది. మరీ డ్రామా ఎక్కువగా అనిపించేలా నటించాడు. కొన్ని మైనస్ లు కనిపించినా చిరంజీవి సినిమా కోసం కష్టపడినట్లే అర్థం అవుతుంది. ఒక కళాకారిణి నుండి సూసైడ్ బాంబ్‌గా మారి ఆంగ్లేయులపై చేసిన పోరాట సన్నివేశాల్లో తమన్నా శభాష్ అనిపించుకుంటుంది.
అమాయకపు భార్య పాత్రలో నయన తార తన పాత్రకు తగ్గట్టుగా నటించింది. అయితే మిగిలిన గొప్ప నటులను మాత్రం దర్శకుడు పెద్దగా వాడుకోలేదు. సైరా గురువు పాత్ర‌లో ఓ పెద్ద న‌టుడ్ని తీసుకురావాలనే ఆత్రం త‌ప్పితే, ఆ పాత్ర అమితాబ్ బ‌చ్చ‌న్ స్థాయికి స‌రిపోతుందా, లేదా? అనేది స‌రిచూసుకోలేదు. బిగ్‌బీ మాత్ర‌మే చేయ‌గ‌దిగిన పాత్ర అయితే బాగుండేది. సుదీప్ పాత్ర‌కంటూ ఓ ల‌క్ష్యం, ఉప‌యోగం ఉంటాయి. విజ‌య్ సేతుప‌తికి అదీ లేదు. ఆ పాత్ర‌ని స‌రిగా డిజైన్ చేయలేదు.

సాంకేతిక విభాగం:
సైరా విషయంలో ముఖ్యంగా నిర్మాణ విలువలు అగ్రభాగాన కనిపిస్తున్నాయి. సినిమా కోసం విపరీతంగా ఖర్చు పెట్టాడు రామ్ చరణ్. సైరా ఆధ్యంతం రామ్ చరణ్ దైర్యమే కనిపిస్తుంది. నిర్మాత‌గా చ‌ర‌ణ్‌కి వంద‌కు వంద మార్కులు ప‌డ‌తాయి. ఖ‌ర్చు విష‌యంలో ఎక్క‌డా రాజీ ప‌డ‌లేదు. టేకింగ్ పరంగా సురేందర్ రెడ్డి తన మార్క్‌ని చూపించాడు. భారీ విజువల్స్ , భారీ గ్రాఫిక్స్‌తో తెరను నింపేశాడు సురేందర్ రెడ్డి. అమిత్ త్రివేది సంగీతం బావుంది కానీ ఇటువంటి భారీ సినిమాకి కీరవాణి లాంటి సంగీత దర్శకులు అయ్యి ఉంటే ఇంకా రిచ్‌గా మ్యూజిక్ అనిపించేది. టెక్నిక‌ల్‌గా బాహుబ‌లి ఓ స్టాండ‌ర్డ్ క్రియేట్ చేసింది. ఇప్పుడు ఇది ఆ స్థాయి అందుకోవాలని ట్రై చేసింది కానీ ఓ 60శాతం చేరుకోగలిగింది. సినిమాకి సినిమాటోగ్రఫీ హైలెట్.. అయితే కొన్ని సన్నివేశాలు సీజీలో తీసినట్లుగా ఈజీగా అర్థం అవుతుంది. ప్ర‌తీ స‌న్నివేశంలోనూ వంద‌ల‌మంది జూనియ‌ర్ ఆర్టిస్టులు క‌నిపిస్తుంటారు. అందుకోసం టీమ్ ఎంత క‌ష్ట‌ప‌డిందో అర్థం అవుతూనే ఉంటుంది. డైలాగులు అక్క‌డ‌క్క‌డ మెరుస్తాయి. కాక‌పోతే బుర్రా సాయిమాధ‌వ్‌ ర‌చ‌న‌లో మునుప‌టి ప‌దును త‌గ్గింది.

ప్లస్ పాయింట్లు:
చిరంజీవి నటన,
నటీనటులు,
సాంకేతిక విభాగం పనితీరు
ఇంటర్వల్ సీన్, క్లైమాక్స్
నిర్మాణ విలువలు

మైనస్ పాయింట్లు:
స్లో..గా సాగే కథనం
సంగీతం
యుద్ధ ఘట్టాలు

ఓవరాల్‌గా కావాల్సినంత హీరోయిజం ఉన్న కథ.. పట్టరానంత కమర్షియాలిటీతో కల్పనను జోడించి ఎక్కువ డబ్బులు పెట్టి చిరంజీవి కోసం రామ్ చరణ్ తీసిన సినిమానే సైరా..

సైరా సినిమాకి లోకాస్త్ర రేటింగ్‌:  2.5/5

Leave A Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.