Have a nice day!

ఎవరు ఈ జార్జ్ రెడ్డి?

ఉస్మానియా చే గువేరా

0 73

‘Who is George Reddy..?’ ఇటీవలికాలంలో సోషల్ మీడియా వాడుతున్న ప్రతి ఒక్కరికి ఎక్కువగా కనిపిస్తున్న ప్రశ్న. అసలు ఎవరు ఈ జార్జ్ రెడ్డి. Who is George Reddy అని ఇప్పుడే ఎందుకు తెలుసుకోవాలి అనే ప్రశ్న కచ్చితంగా వస్తుంది. రావాల్సిందే కూడా. జార్జ్ రెడ్డి.. నాలుగు దశాబ్దాల క్రితం ఉద్యమాలకు పురిటి గడ్డ అయిన ఉస్మానియాలో పుట్టిన చే గువేరా జార్జ్ రెడ్డి. మనలో చాలా మందికి ఇప్పుడు ఉన్న యువతకు తెలియని ఓ రియల్ హీరో జార్జ్ రెడ్డి.

చరిత్రలో ఓ రాజకీయ ఉద్యమ జననానికి ఓ ఉద్యమకారుడి భౌతిక మరణమే తక్షణ కారకంగా పనిచేసిన విశిష్ట సందర్భాలు అత్యంత అరుదు. అలాంటి అరుదైన మరణాలలో ఒకటి జార్జిరెడ్డి మరణం. ఉస్మానియా యూనివర్శిటీలో 1970 దశాబ్దారంభంలో ప్రగతిశీల విద్యార్థి ఉద్యమ నిర్మాణానికి జార్జ్ రెడ్డి రాజకీయ పునాదులు వేశాడు. ఆ మార్గంలోనే 1972, ఏప్రిల్ 4వ తేదీన ఇంజనీరింగ్ కాలేజీ వసతి భవనం (నేటి కిన్నెర హాస్టల్) ఎదుట కొన్ని శక్తుల చేతుల్లో చనిపోయాడు.

ఉస్మానియా క్యాంపస్‌లో సామాజికంగా అట్టడుగు విద్యార్థులను చైతన్య పరచిన వ్యక్తి జార్జ్ రెడ్డి. అటువంటి జార్జిరెడ్డి సరిగ్గా అంబేద్కర్ జయంతి రోజే చనిపోయాడు. అయితే అణచివేయలేనంత అపారమైన ప్రతిభే ఆయనను ఇప్పటికీ కొంతమందికి గుర్తుండేలా చేసింది. జార్జ్ రెడ్డి కేవలం ఓ ఉద్యమ భావజాల యువనేత మాత్రమే కాదు.. ‘ఇజం’ ఏదైనా, పోరుబాట ఎలాంటిదైనా, నాయకుడెవరైనా.. అనుసరించదగ్గ నాయకత్వ వ్యక్తిత్వం ఉన్నవాడు.

భారతదేశానికి స్వాతంత్య్రం రావడానికి సరిగ్గా ఏడునెలల ముందు జార్జ్ రెడ్డి పుట్టాడు. 1947 జనవరి 15న. లీలా వర్గీస్, రఘునాథరెడ్డి దంపతులకు నాల్గవ సంతానంగా పుట్టాడు. పుట్టింది కేరళలోని పాలక్కాడ్. తల్లి మలయాళీ. ఉపాధ్యాయురాలు. తండ్రిది చిత్తూరు జిల్లా పీలేరు నియోజకవర్గం రొంపిచర్ల గ్రామం. ఆయన ఉద్యోగరీత్యా అనేక ఊర్లు తిరిగేవారు. జార్జ్ రెడ్డి అన్నయ్య కారల్‌రెడ్డి ఐఏఎస్ ఆఫీసర్.

చిన్నప్పటి నుంచి జార్జిరెడ్డి పుస్తకాల పురుగు. చదువులో ఫస్ట్. నిజాం కాలేజీలో బీఎస్సీ పూర్తి చేసి ఉస్మానియా యూనివర్సిటీలో ఎమ్మెస్సీలో చేరాడు. అణు భౌతిక శాస్త్రంలో బంగారు పతకం పొందిన విద్యార్థిగా క్యాంపస్ విద్యార్థి లోకపు హృదయాల్లో జార్జ్ రెడ్డికి సుస్థిర స్థానం లభించింది. గ్రంథాలయాల్లో అధిక సమయం ఉండడం ద్వారా సమకాలీన జాతీయ, అంతర్జాతీయ, చారిత్రక పరిణామాలపై అవగాహన పెంచుకున్నాడు.

విద్యార్థుల ఆర్థిక, రాజకీయ, సామాజిక సమస్యల పట్ల అమితంగా స్పందించేవాడు. ముఖ్యంగా ఉస్మానియా క్యాంపస్‌లో అప్పటికే దారుణంగా ప్రబలం అయి ఉన్న గూండాయిజం, రౌడీయిజాలను సాహసోపేతంగా ప్రతిఘటించిన వ్యక్తి జార్జ్ రెడ్డి. సమాజంలో ఒకరు మరొకరిని దోపిడీ చేసే వర్గదృక్కోణాన్ని అవలోకనం చేసుకున్నాడు. వామపక్షతత్వ అంశాలను, మార్క్సిస్ట్ ఆలోచనలను అర్థం చేసుకున్నాడు.

అంతర్జాతీయంగా చే గువేరా విప్లవ జీవితం జార్జ్ రెడ్డిని అమితంగా ప్రభావితం చేసింది. అదే కాలంలో ఫ్రెంచ్ విద్యార్థుల ‘రెక్కవిప్పిన రెవల్యూషన్’ మరో గొప్ప రాజకీయ ప్రేరణనిచ్చింది. వియత్నాం విప్లవ పోరాటం జార్జిని పరవశింపజేసింది. శ్రీకాకుళం, గోదావరిలోయ ప్రతిఘటనా పోరాటాలకి ఉత్తేజితుడు అయ్యాడు. ముఖ్యంగా అమరజీవి నీలం రామచంద్రయ్యతో సంబంధం ద్వారా నిరంతర చర్చలు జరిగి గోదావరి లోయ ప్రతిఘటనోద్యమ విప్లవ నిర్మాణ సంస్థకి రాజకీయంగా చేరువయ్యాడు.

మార్క్సిజంపై విద్యార్థుల్లో చర్చాగోష్టులు నిర్వహించాడు. ఈ దిశలో సాగిన రాజకీయ కృషిలోనే తన 25వ ఏటనే జార్జ్ రెడ్డి హత్యకు గురయ్యాడు. విప్లవ ఆదర్శాలకి ప్రతిరూపంగా.. నిజాయితీ, నిస్వార్థత, నిరాడంబరత, త్యాగనిరతి, శ్రమతత్వం, సేవాతత్పరత, అధ్యయనం వంటి విలువలతో.. మరణించినా కూడా ‘జీనా హైతో మర్‌నా సీఖో, కదమ్ కదమ్ పర లడ్‌నా సీకో’ (బతకాలంటే చావడం నేర్చుకో, అడుగడుగునా పోరాటం నేర్చుకో) నినాదం విద్యార్థి లోకానికి అందించాడు.

స్వతహాగా జార్జ్ రెడ్డి బాక్సర్, బ్లేడ్ ఫైటర్. అడిగినవారికీ అడగనివారికీ సహాయం చేసేవాడు. ఫీజులు, మెస్సులు, పుస్తకాలు, అణచివేతలు, అవమానాలు, దుఃఖాలు, ఆత్మన్యూనతలు.. ఇలా విద్యార్థుల్లో ఎలాంటి కష్టాలు ఉన్నా వెంటనే హాజరయ్యేవాడు. క్యాంపస్ వాతావరణంపై అనవసర పట్టు సాధించాలని ప్రయత్నించే స్వార్థపు శక్తులతో పోరాడేవాడు. ఆ క్రమంలో అనేకసార్లు భౌతికంగా జార్జ్ రెడ్డిపై దాడులు జరిగాయి.

అందుకే ఎప్పుడూ తనతోపాటు ఆరంగుళాల కత్తి ఉంచుకునేవాడు జార్జ్ రెడ్డి. తాను పుట్టింది తన కోసం కాదని పీడిత తాడిత లోకం కోసమని తెలిసి వారి కోసం పోరాటం చేసేవాడు. ఓసారి క్యాంపస్‌లో చిన్న గొడవ జరగడంతో జార్జిరెడ్డిని ఏడాదిపాటు క్లాసులకు రాకుండా నిషేధించారు ప్రిన్సిపాల్. అయితే ఏడాది అజ్ఞాతవాసం తర్వాత ఎమ్మెస్సీ పరీక్షల్లో యూనివర్సిటీ టాపర్‌గా నిలిచాడు జార్జ్ రెడ్డి. గోల్డ్‌మెడల్ సాధించాడు.

విస్తృత అధ్యయనం కారణంగా జార్జ్ రెడ్డిలోని మార్క్సిస్టు సైద్ధాంతిక విశ్వాసాలు, విప్లవభావాలు, స్పష్టమైన రూపు కట్టాయి. శాస్త్రీయ సోషలిస్ట్ సిద్ధాంతాల అన్వేషణ అతనిలో ప్రారంభమైంది. ఆంధ్రదేశంలోనే కాదు, దేశంలోనూ, ప్రపంచంలోనూ 1960 దశకంలో జరిగిన అనేకానేక పరిణామాలు జార్జ్ రెడ్డిలోని ప్రశ్నించే తత్వాన్ని తట్టిలేపాయి. ఆలోచనను మరింత చురకత్తిలా చేశాయి. 1967 నాటి పశ్చిమబెంగాల్ నక్సల్బరీ పోరాటం, తెలంగాణలోని అశాంతి, నిరుద్యోగం, శ్రీకాకుళ సాయుధ గిరిజన రైతాంగ పోరాటం, వియత్నాం యుద్ధం… అన్నీ జార్జ్ రెడ్డిని ప్రభావితం చేశాయి.

1968 మేలో ఫ్రాన్స్ అధ్యక్షుడు చారల్స్ డి గా ల్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా లక్షలాది మంది కార్మికులు ఏకమై చేసిన విద్యార్థి ఉద్యమం.. దక్షిణాఫ్రికాలో సొవెటో ప్రాంతంలో చెలరేగిన విద్యార్థి ఉద్యమం.. వర్ణవివక్షకు వ్యతిరేకంగా వెల్లువెత్తిన పోరాటం.. అమెరికాలో 1966లో ఆఫ్రో అమెరికన్ విప్లవ వామపక్షవాదులు తీసుకొచ్చిన బ్లాక్ పాంథర్స్ ఉద్యమం.. జార్జ్ రెడ్డిపై తీవ్ర ప్రభావం చూపాయి.

ఒక మార్క్స్, ఒక హెగెల్, ఒక చే గువేర, ఒక మిఖాయిల్ బుకునిన్ అందించిన దార్శనికతతో విప్లవ పోరాటాలను అవలోకనం చేసుకున్నాడు. ప్రపంచమేమిటో, బలవంతులు బలహీనులను దోపిడీ చేసే ప్రక్రియ ఏమిటో, లోకపుటన్యాయాలు, కాల్చే ఆకలి, కూల్చే వేదన, దారిద్య్రాలూ, దౌర్జన్యాలూ ఏమిటో అర్థమైంది జార్జ్. దీంతో అతని పోరాటం కారణంగా జార్జ్ రెడ్డి ఉస్మానియా క్యాంపస్‌లో హీరోగా మారాడు.

5 అడుగుల ఆరు అంగుళాల ఎత్తు, గోధుమవన్నె రంగు, కొద్దిగా గడ్డం, సన్నటిమీసం, దృఢకాయం, ఎడమపాపిట, పొట్టిచేతులతో కూడిన బుష్‌షర్ట్‌తో అప్పుడప్పుడు; ఆపై వెడల్పాటి జేబులు, పొడుగు చేతుల ఆలివ్‌గ్రీన్ చొక్కా, కాటన్ జీన్స్‌తో నడుస్తుంటే జార్జ్ రెడ్డి వెనుక ఎంతోమంది నడిచారు. చెదరని చిరునవ్వు, కాంతిపుంజాల్లా కళ్లు, రోజూ గంటపాటు జిమ్‌లో బస్కీలు, గుంజీలు, బ్యాక్ బెండింగ్, పొత్తికడుపు వ్యాయామాలు, మల్లయుద్ధం ప్రాక్టీస్.. అతనిని రియల్ హీరో అనిపించేలా చేశాయి.

విద్యార్థులలో సాంఘిక స్పృహ, ప్రగతిశీల భావాల్ని పెంచేందుకు జార్జ్ ఎంతో కృషి చేశాడు. సైన్స్ కాలేజీకి, ఆస్ట్రానమీ డిపార్ట్‌మెంటుకీ ఆనుకొని ఉన్న క్యాంటీన్ వారందరికీ అడ్డా. క్యాంటీన్‌ని ఆనుకుని ఉన్న వేపచెట్టు, దానికింద నాలుగైదు బండరాళ్లు, వాటిపై కూర్చొని రాత్రిళ్లు కూడా నలభై ఏభై మంది చుట్టూ ఉంటే మధ్యలో జార్జ్ రెడ్డి. నాయకునిలా ఉండేవాడు.

అంతగా రాని తెలుగులో, హైదరాబాదీ హిందీలో, చక్కటి ఇంగ్లిష్‌లో జార్జ్ రెడ్డి ప్రసంగాలు ఉండేవి. ఎప్పుడు కూడా చెప్పులే వేసుకునేవాడు. బట్టలు ఎక్కువ ఉండేవి కావు. రెండే రెండు జతలు. కొనుక్కోలేక కాదు. కొనుక్కోవడానికి ఆస్కారం లేని లక్షలాది పేదల్లా తానూ బతకాలని అలా ఉండేవాడు. ఒక పూటే తినేవాడు. ఆకలితో మలమల్లాడుతున్న నిర్భాగ్య అన్నార్తుల ఆకలి కేకలేంటో తానూ అనుభవించాలని! కాగితం మీద రాస్తే కూడా మొత్తమంతా ఎక్కడా ఖాళీలేకుండా రాసేవాడు. నిర్లక్ష్యం, అహంకారం అతగాడికి తెలీవ్. ఎప్పుడూ సిటీబస్సుల్లోనే తిరిగేవాడు. గర్వం అనేది ఎక్కడా ఉండేది కాదు.

అతని మాటల్లో తీవ్రత, నిజాయతీ, స్పష్టత ఉండేవి. తనకు వచ్చే స్కాలర్‌షిప్ డబ్బులను ఏ ఆధారం లేని ఓ బాల్యమిత్రుడికి వ్యాపారం పెట్టుకోమని ఇచ్చేశాడు. విద్యార్థుల్లో శాస్త్రీయ దృష్టిని, విషయ పరిజ్ఞానాన్ని పెంచేందుకు అనేక సెమినార్లు నిర్వహించాడు. రిక్షా కార్మికులతో కలసి భోజనం చేసేవాడు. అయితే అదే సమయంలో క్యాంపస్‌లోని సమస్యలపై పోరాడేవాడు. ఫలితంగా శత్రువులు పెరిగారు. సోషలిస్టు భావాల్ని, ఆదర్శాలను వ్యాప్తి చెయ్యాలనే లక్ష్యంతో స్టడీసర్కిల్‌ను ఏర్పాటు చేశాడు.

జార్జ్ రెడ్డి అప్రతిహతంగా సాగిస్తున్న ఉద్యమబాటను నిరోధించాలనే కుట్రతో 1972 ఫిబ్రవరిలో జార్జిపై డీడీ కాలనీలో దాడి చేశారు కొందరు. అప్పుడు తీవ్ర గాయాలు అవగా.. అప్పటి నుంచి ఒంటరిగా తిరగడం మంచిది కాదని మిత్రులు సూచించేవారు. అప్పుడు ‘చావు అంత తేలికగా తన దగ్గరకు రాదని’ నవ్వుతూ అనేవాడు. అలా అన్న వారానికే 1972 ఏప్రిల్ 14న సాయంత్రం ఉస్మానియా ఇంజినీరింగ్ కాలేజీ భవనం దగ్గర శత్రువుల చేతిలో చనిపోయాడు. మరణించిన తర్వాత ప్రగతిశీల విద్యార్థి ఉద్యమానికి పునాది అయ్యాడు. త్వరలో జార్జ్ రెడ్డి జీవితంపై ఓ సినిమా తీస్తుండడంతో ఇప్పుడు అందరూ జార్జ్ రెడ్డి ఎవరూ? అని వెతికే పనిలో పడ్డారు. అందకోసమే ఈ సమగ్ర కథనం.

సినిమా కోసం కొంత సినిమాటిక్ లిబర్టీని యాడ్ చేసినట్లు కనిపించవచ్చు కానీ లేటెస్ట్ గా విడుదలైనా జార్జ్ రెడ్డి టీజర్ మాత్రం ఆకట్టుకుంటుంది. ఏదేమైనా ఓ సినిమా ద్వారా జార్జ్ రెడ్డి లాంటి అత్యంత ప్రతిభావతుండైన, ప్రభావవంతుడైన యువ నాయకుని గురించి భావి తరాలకు తెలుసుకునే అవకాశం కల్పించేలా తీసిన సినిమా యూనిట్ ని అభినందించాల్సిందే.

చరిత్ర మరచిపోయిన విద్యార్థి నాయకుడి జీవితాన్ని వెండితెరపై ‘జార్జ్ రెడ్డి’.. (ఏ మ్యాన్ ఆఫ్ యాక్షన్) అనే పేరుతో సిల్లీ మాంక్స్, త్రీ లైన్ సినిమా బ్యానర్స్‌తో కలిసి మైక్ మూవీస్ అధినేత అప్పిరెడ్డి నిర్మిస్తున్నారు. ‘దళం’ ఫేమ్ జీవన్ రెడ్డి సినిమాకి దర్శకత్వం వహించాడు. వంగవీటి మూవీతో ఆకట్టుకున్న సందీప్ మాధవ్ జార్జ్ రెడ్డి క్యారెక్టర్‌‌లో నటించాడు. సినిమా విడుదల తేదీని మాత్రం ప్రకటించలేదు.

Leave A Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.