Have a nice day!

కాస్త కామెడీ యాంగిల్: సోషల్ మీడియా విలువలు చెబుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్

గురివింద గింజ సామెత లెక్క : విషాన్ని తెచ్చిందే వైసీపీ కాదా?

0 156

ట్రెండ్ మారిపోయింది. సోషల్ మీడియాపై ఆధారపడి రాజకీయాలు నడిచేస్తున్నాయి. పార్టీలు కూడా అనుకూల వ్యక్తులను ప్రోత్సహిస్తూ ప్రచారాలను పెంచేస్తున్నాయి. ఈ క్రమంలోనే పార్టీల కార్యకర్తలు, నాయకులు శృతి మించి ప్రత్యర్ధి పార్టీలపైన తీవ్రస్థాయిలో విపరీతమైన పదజాలంతో పోస్టింగులు చేస్తూ వ్యక్తిగత ఇమేజ్‌ను తీసేస్తున్నారు. పవన్ కల్యాణ్, జగన్, బాలకృష్ణ, చంద్రబాబు, లోకేష్, ప్రధాని మోడీ.. ఇలా అగ్రనేతలందరి వ్యక్తిగత జీవితాలపైనా ట్రోలింగ్ సగర్వంగా చేసేస్తున్నారు ఆయా పార్టీల వ్యతిరేకులు.

ఏ ఒక్క పార్టీనో కాదు.. ప్రతీ పార్టీది ఇప్పుడు ఒకటే సిద్దాంతం.. ఎన్నికల యుద్ధంలో గెలవడం. యుద్దం గెలవాలంటే ప్రత్యర్థులకు ఉన్న శక్తి, సామర్ధ్యాల్ని నిర్విర్యం చేసి.. సామదాన బేద దండోపాయాల్ని ఉపయోగించి బలహీనులుగా మార్చడం.. అలా చేస్తే అనుకున్న లక్ష్యాన్ని చేరవచ్చు. అందులో బాగంగానే పార్టీలు ప్రత్యర్ధులపై దాడికి సోషల్ మీడియాని అస్త్రంగా ఎంచుకుంటున్నాయి. ఇటీవల వైఎస్‌ఆర్ కాంగ్రెస్ నేతలు తమపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం జరుగుతుందంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంతేనా కొంతమంది టీడీపీ సానుభూతిపరులను.. మరికొంతమంది జనసేన సానుభూతి పరులను అరెస్టులు కూడా చేసేశారు.

పార్టీల వైఖరి, సిద్ధాంతాలతో ఎవరైనా విభేదించవచ్చు. ప్రజాస్వామ్యంలో అది మంచి పరిణామమే. అయితే అది దిగజారి నేతల వ్యక్తిగత జీవితాలపై దాడిగా మారిపోయింది. కొంచెం నవ్వించి నాయకులకు కూడా చురుకు పుట్టించే గుణం గతంలో పత్రికలలోని కార్టూన్స్‌కు ఉండేది. అయితే కార్టూన్ మాటున ఇప్పుడు వెకిలివేషాలు పెరిగిపోయాయి. వ్యక్తిగత జీవితాలపై కామెంట్స్ చేసి అవే జోకులంటూ షేర్‌లు చేస్తూ ఆనందిస్తున్నారు. మార్ఫింగులు, విపరీతమైన వీడియోలు.. అబ్బో అసలు మేమెందుకు పుట్టామా? అని నేతలు అనుకునే రీతిలో చేస్తున్నారు కొందరు నెటిజన్లు.

గతంలో సోషల్ మీడియాలో ఇంటూరి రవి అనే వ్యక్తిని అరెస్ట్ చేస్తే.. ఏదో దేశ స్వాతంత్ర సమరయోధునిని అరెస్ట్ చేసినట్లు వైసీపీ, కొందరు ముసగు వేసుకున్న విశ్లేషకులు స్వేచ్చకు భంగం కలిగించారు అని నానా యాగీ చేశారు. అయితే ఇప్పటికి కూడా అతను రన్ చేసే పేజుల్లోకి వెళ్తే.. లోకేష్ మీద, చంద్రబాబు మీద, పవన్ కళ్యాణ్ మీద దారుణమైన వ్యాఖ్యలు ఉంటాయి. ఇప్పుడు తెలుగుదేశం, జనసేనలు కూడా అదే సిద్ధాంతాన్ని స్టార్ట్ చేశాయి. వాళ్లు సక్సెస్ అయ్యారు కదా? మనం ఎందుకు కాకూడదు అని వీళ్లు కూడా కాస్త శృతి మించిపోతున్నారు. ఇక్కడే అసలు తంటా వచ్చి పడింది. చంద్రబాబు ప్రభుత్వం ఉన్నప్పుడు ఒకరో ఇద్దరినో అరెస్ట్ చేసింది.. వాళ్లకు క్రేజ్ తీసుకొచ్చి వదిలి పెట్టింది. ఇప్పుడు పరిస్థితి అలా లేదు. బయటకు తెలిసేలా ఒకరిద్దరు అరెస్ట్ అయితే వందల మందిని అనధికారికంగా అరెస్ట్ చేస్తున్నారు.

మంచి సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకునేందుకు సోషల్ మీడియా అద్భుత సాధనం. కానీ.. రాజకీయ పార్టీలు సోషల్ మీడియాను కూడా పాడు చేసేశాయి. తమ నేతలకు అండగా ప్రత్యర్థి పార్టీ నేతలపై తీవ్ర విమర్శలు చేయడం పార్టీల వీరాభిమానులకు పరిపాటిగా మారింది. సోషల్ మీడియాలో పలానా విషయం పోస్ట్ చేయకూడదన్న నియమం ఏమీ లేదు. కాస్త ఫొటోషాప్ తెలిసి, నాలుగు అక్షరాలు రాసే జ్ఞానం ఉంటే చాలు. కామన్‌సెన్స్ లేకపోయినా కామెడీ పేరుతో కాంట్రవర్శీలు క్రియేట్ చేస్తారు. అనైతిక ప్రచారాలు, వ్యక్తిగత సోషల్ దాడులు ప్రజా జీవితంలో ఉన్న అనేక మందిపై జరుగుతున్నాయి. ట్రోలింగ్ అని చిన్న పదం వాడినా కూడా ప్రభావం చాలా బలంగా సమాజంపై పడుతుంది.

సోషల్ మీడియాలో భయంకరంగా ట్రోల్ అయ్యేదెవరంటే నందమూరి బాలకృష్ణ పేరే వినిపిస్తుంది. కొన్ని సార్లు ఆయన పాత సినిమాల్లోని క్లిప్పింగ్స్, పొలిటికల్ కామెంట్స్ కలగలిపి కిచిడి చేసి జనాలలోకి వదులుతుంటారు. కానీ అది ఓ వ్యక్తిపై జరుగుతున్న సోషల్ దాడి అని గుర్తించరు. నారా లోకేష్ పైనా పవన్ కల్యాణ్ పైనా సోషల్ మీడియాలో చేసే వ్యాఖ్యలు మాములుగా ఉండవు. పవన్ గుండు విషయంలోనూ.. ఆయన పెళ్లిళ్లకు సంబంధించి ఏ స్థాయిలో దుష్ప్రచారం జరిగిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన విషయాలపై పవన్ అనేక సార్లు వివరణ ఇచ్చినా ప్రత్యర్థి వర్గాలు దిగజారుడు కామెంట్స్ చేస్తూనే ఉంది. దీనికి కౌంటర్‌గా జనసేన కార్యకర్తలు అత్యుత్సాహంతో ప్రత్యర్థి పార్టీ నేతల వ్యక్తిగత జీవితాలను దూషిస్తూ ఉంటారు. ఈ రెండూ సరైనవి కావనే స్పృహ ఆయా పార్టీల నేతలకు, కార్యకర్తలకూ లేదు. ఇక సోషల్ మీడియాలో అనుకూలంగానో, వ్యతిరేకంగా రాసుకుంటే మార్ఫింగులు చేసుకుంటే నాయకులు అయిపోరు అనే చిన్న లాజిక్ తెలుసుకుంటే మార్పు రావచ్చేమో.

ఇక తాను చేస్తేనేకాదు, తమవాళ్లు చేస్తే శృంగారం, వేరేవాళ్లు చేస్తే వ్యభిచారం అన్నట్టుగా ఉంది వైసీపీ తీరు. సంస్కారం గురించి మాట్లాడే వైసీపీ అండ్ కో.. ముందు దాన్ని తమ వారికి నేర్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వైసీపీ అభిమాన వర్గమే ఈ వల్గర్ పోస్టులకు, నీఛమైన కామెంట్లకు తెరలేపింది అనేది వాస్తవం. ఈ విషయాన్ని ఎవరూ కాదనలేరు కూడా. అది ప్రశాంత్ కిషోర్ నేతృత్వంలో జరిగిందో ఎలా జరిగిందో కానీ తెలుగు రాష్ట్రాల్లో సోషల్ మీడియాని గబ్బు పట్టించారు. చేసిందంతా చేసి ఇప్పుడు మాత్రం తెగ ఫీల్ అయిపోతున్నారు వైసీపీ నాయకులు. డీజీపీకి ఓ ఎమ్మెల్యేల బృందం వెళ్లి మరీ ఫిర్యాదులు చేసేశారు. ముందు జగన్ ఇచ్చే జీతభత్యాలతో పని చేస్తూ నీఛ ప్రచారం చేస్తుండేవారికి చెక్ పెట్టి మిగిలిన వాళ్లపై వైసీపీ పడితే బాగుంటుంది.

వెకిలి కామెంట్‌లపై సైబర్ క్రైం పోలీసు యంత్రాంగం కానీ ఇతరులు కానీ ఏమీ చేయలేని పరిస్థితే ప్రస్తుతం ఉంది. ప్రతీ ఒక్కరికీ వ్యక్తిగత జీవితం ఉంటుందని, ఆ జీవితానికి భంగం కలుగుతుందనే ఆలోచన ఈ ట్రోలింగ్ చేసేవాళ్లకు ఉండదు. రోజుకు ఐదు రూపాయలకే 1జీబీ డేటా వస్తుంది. ఫొటో ట్రిక్స్ ఉన్న అత్యాధునిక స్మార్ట్‌ఫోన్స్ తక్కువ ధరకే లభిస్తున్నాయి. సోషల్ మీడియా అకౌంట్ ఎలాగూ ఉచితమే. కానీ ఎవరిపైనైనా వ్యాఖ్యలు చేయడానికి ఇదే అర్హత అని అనుకుంటే పొరపాటు అవుతుంది. ప్రజా జీవితంలో ఉన్నారనో, ఓట్లు అడుగుతున్నారనో, సినిమాలు తీస్తున్నారనో వారి జీవితంపైన ఇష్టమొచ్చినట్లు కామెంట్లు చేసేస్తున్నారు. వీటికి స్వీయ నియంత్రణ తప్ప మరొక మార్గం లేదు.

Leave A Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.