Have a nice day!

కోలుకోవడం కష్టమే: ఆదాయం పతనంలో ఆంధ్రప్రదేశ్ నెం.1

దారుణంగా పడిపోయిన ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి

0 57

ఓ వైపు ఆర్థిక మాంద్యం, మరో వైపు అర్థం పర్థం లేని ప్రభుత్వ నిర్ణయం.. అవగాహన లేని పనులు.. మొత్తంగా ఆంధ్రప్రదేశ్‌ను పతనంలో మొదటి స్థానంలో నిలిపేసింది వైసీపీ ప్రభుత్వం. ఆదాయం పతనంలో ఆంధ్రప్రదేశ్ అన్ని రాష్ట్రాల కంటే అగ్రస్థానంలో ఉందనేది వాస్తవం. ఏప్రిల్-జూలై నెలల్లో ఆంధ్రప్రదేశ్ పన్నుల ఆదాయం గతంతో పోలిస్తే.. 42.7శాతం తగ్గిపోయింది. అంటే సగానికి సగం తగ్గిందన మాట. ఇది సామాన్యమైన విషయం కాదు. ఆదాయం కోల్పోయిన రాష్ట్రాలు చాలా ఉన్నా కూడా, వాటన్నింటి కంటే కూడా ఆంధ్రప్రదేశ్‌ అగ్రభాగంలో ఉంది.

ఆంధ్రప్రదేశ్ తర్వాత ఎక్కువగా ఆదాయం తగ్గిన రాష్ట్రాల్లో పంజాబ్ ఉండగా.. ఆ రాష్ట్రానికి తగ్గిన ఆదాయం 12.5 శాతం మాత్రమే. అంటే ఆంధ్రప్రదేశ్ ఆదాయంకు పంజాబ్ ఆదాయంకు కూడా 30 శాతం తేడా కనిపిస్తుంది. గుజరాత్, కర్ణాటక, కేరళ కూడా.. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఆదాయం కోల్పోయింది. అయితే.. ఈ తగ్గుదల ఏపీతో పోలిస్తే.. 10శాతానికి అటూ ఇటుగానే ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆర్థిక మాంద్యం, ఇతర కారణాలతో తగ్గిపోయిన ఆర్థిక కార్యకలాపాలతో ఆయా రాష్ట్రాల్లో ఆదాయం తగ్గింది. అయితే ఆయా రాష్ట్రాల్లో ఇది మళ్లీ గాడిలో పడే అవకాశం ఉంది. కానీ ఆంధ్రప్రదేశ్ లో మాత్రం పరిస్థితి అటువంటిది కాదు.

ప్రభుత్వ నిర్ణయాలు ఇందులో ఓ ముఖ్యమైన పాత్రను పోషిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో ఆర్థికంగా ఆదుకునే వాహకాలను ఏపీ ప్రభుత్వం అడ్డుకుంటుంది. వైసీపీ ప్రభుత్వం అధికారం చేపట్టగానే ఏపీలో నిలిచిన వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలు ఇందుకు కారణం. అమరావతిలో రూ. యాభై వేల కోట్ల విలువైన పనులు జరుగుతూండగా అవి ఆగిపోయాయి. ఇసుక రవాణా ఆగడంతో.. అందులో జాప్యం కారణంగా ఏపీ వ్యాప్తంగా నిర్మాణ కార్యకలాపాలు నిలిచిపోయాయి. ఇక ఇతర వ్యాపారాల్లో సైతం వైసీపీ నేతల పెత్తనం కారణంగా పారిశ్రామికవేత్తలు ఏపీకి దూరంగా జరుగుతున్నారు.

దీంతో ఏపీలో ఆర్థిక కార్యకలాపాలు మందగించగా నగదు చలామణి ఆగిపోయింది. ప్రభుత్వానికి పన్ను ద్వారా వచ్చే ఆదాయం తగ్గిపోయింది. ఇప్పుడు తప్పు దిద్దుకున్నా .. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందనే నమ్మకం లేదు. ప్రభుత్వానికి పన్ను ఆదాయం నలభై శాతం మేర పడిపోయిదంటే ప్రజలకు ఎంత మేర నష్టం వచ్చిందో అంచనా వేయడం కష్టమేమీ కాదు. కనీసం యాభై వేల కోట్లను ప్రజలు నష్టపోయి ఉంటారని ఆర్థిక నిపుణుల అంచనా. నాలుగు నెలలుగా పనులు లేకపోవడం వల్ల నిర్మాణ రంగ కూలీలు రూ. పదిహేను వేల కోట్ల వరకూ ఆదాయం కోల్పోయారు. ఇటువంటి పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి మళ్లీ సాధారణ స్థితికి తీసుకురావడం ఇప్పట్లో జరిగే పని కాదని ఆర్థిక నిపుణుల అంచనా.

Leave A Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.