Have a nice day!

వైసీపీలోకి జూపూడీ: వ్యతిరేకిస్తున్న క్యాడర్.. లైట్ తీసుకున్న టీడీపీ

ఏంటన్నా జగన్ ఇలా చేస్తున్నడు? అంటున్న వైసీపీ సోషల్ మీడియా

0 47

ఏంటన్నా జగన్ ఇలా చేస్తున్నడు? సోషల్ మీడియాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతిపరులు వేసుకుంటున్న ప్రశ్న ఇది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబుని, లోకేష్ ని, తెలుగుదేశం పార్టీ వాళ్లను విమర్శించడానికి ఆ పార్టీ వాళ్లకు కావలసినంత స్టఫ్ దొరికింది. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అదే మార్ఫింగులు.. అదే కహానీలు అంటే వినే ఓపిక చాలామందికి ఉండదు. చూడాలంటే చిరాకు అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దానికి తోడు ప్రభుత్వంలో ఉన్నప్పుడు తీసుకునే కొన్ని నిర్ణయాలను సమర్ధించుకోవడం మామూలు విషయం కాదు. ఇప్పుడు దసరా పండుగ రోజు కూడా వైసీపీ వాళ్ల పరిస్థితి ఇదే.

అధికారంలోకి వచ్చిన తరువాత తమను పట్టించుకోవట్లేదంటూ పార్టీ అగ్ర నాయకత్వంపై ఇప్పటికే అసంతృప్తి వ్యక్తం చేస్తున్న సోషల్ మీడియా క్యాడర్.. జూపూడి ప్రభాకర్ సొంత గూటికి చేరుకోవడం, ఆటోల వెనుక థ్యాంక్యూ అనే స్టిక్కర్లు పోలీసుల చేత అతికించడం వంటి ఉదంతాలు చేసుకోవడంతో వైసీపీ సోషల్ మీడియా క్యాడర్ కాస్త డిఫెండ్ చేసుకోవడం కష్టంగా మారిపోయింది. అధికారంలో ఉన్నప్పుడు చేరేవాళ్లకు వాళ్ల వాళ్ల అవసరాలు ఉండొచ్చు.. అవకాశాల కోసం ఆశలు ఉండొచ్చు.. ఒకప్పుడు అపర నియంతలా కనిపించిన జగనే ఇప్పుడు ఫిడెల్ క్యాస్ట్రోలాగా మారిపోవచ్చు. కానీ చేర్చుకునేవాడికి ఇప్పుడు ఆ అవసరం ఏముంది..? అనేది ఆ పార్టలో లేవనెత్తుతున్న పెద్ద ప్రశ్న.

తెలుగుదేశం పార్టీలో జూపూడి ప్రభాకర్ వైసీపీపై, వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఘాటు విమర్శలే చేశారు. అయితే ఇప్పుడు మాత్రం.. జగన్ ఫిడెల్ కాస్ట్రో.. జగన్ తండ్రి లేనివాడు అందుకే తోడుగా వచ్చా అంటూ భారీ డైలాగులే చెప్తున్నారు. అయితే వైఎస్ జగన్ పై తీవ్రమైన ఆరోపణలు జూపూడి చేసిన సమయంలో ఈ సోషల్ మీడియా అతనిపై విరుచుకుపడింది. ఇప్పుడు అదే జూపూడిని నెత్తిన తెచ్చి పెట్టడం వాళ్లకు రుచించడం లేదు. పాదయాత్రల ద్వారా ముఖ్యమంత్రులు కాలేరంటూ టీవీ డిబేట్లలో నిప్పులు చెరిగారు. కార్పోరేషన్ కట్టబెట్టి సముచిత స్థానం ఇచ్చిన టీడీపీలోకి వెళ్లి తప్పు చేశానంటూ మాట్లడడం కాస్త ఆర్టిఫిషియల్ గా అనిపిస్తుంది. ఈ క్రమంలోనే సొంత పార్టీ కార్యకర్తలే జూపూడి చేరికను నిరసిస్తూ పోస్టుల మీద పోస్టులు పెడుతున్నారు. ట్వీట్ల మీద ట్వీట్లు చేస్తున్నారు.

జూపూడి చేరికకు తోడు.. ఆటోల వెనుక వైఎస్ఆర్ వాహనమిత్ర స్టిక్కర్లను అతికించడం.. దానిపై విమర్శలు రావడం.. వైసీపీ సోషల్ మీడియా క్యాడర్ ను మరింత ఇరకాటంలోకి నెట్టినట్టుగా అయ్యింది. అయితే ఇప్పటికిప్పుడు ఈ వైసీపీ సోషల్ మీడియా వాళ్లు బాధపడిపోతున్నారు. కానీ ఇటువంటి అవమానాలు ఎన్నో భరించాలి. మరోవైపు టీడీపీ జూపూడి వెళ్లడంపై ప్రశాంతంగా ఉన్నట్లు అర్థం అవుతుంది. టీడీపీలో ఉన్నప్పుడు జగన్ దళిత వ్యతిరేకి అన్నాడు. ఇప్పుడు అక్కడికి వెళ్ళి టీడీపీ దళితుల అభివృద్ధికి ఏమీ చేయలేదు అంటాడు. పట్టించుకోకండి అంటూ టీడీపీ నేతలే అతను వెళ్లిపోవడాన్ని పట్టించుకోట్లేదు.

Leave A Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.